హైదరాబాద్: భారత ప్రభుత్వం తన సేవలను తిరిగి కోరుకుంటే తప్పకుండా తిరిగివస్తానని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామరాజన్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో బోధనావృత్తిలో ఉన్నారు. కరోనా కల్లోలం నేపథ్యలో దేశం తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవసరమైతే తన సేవలు తప్పక అందిస్తానని ఆయన స్పష్టం చేశారు. అత్యవసర రంగంలోనివి తప్ప అన్ని వ్యాపారాలు ప్రస్తుతం మూతబడి ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో మీ సేవలు అందిస్తారా? అని మీడియా టెలిఫోన్ ఇంటర్వ్యూలో అడిగితే, సూటిగా చెప్పాలంటే అవును అని ఆయన సమాధానమిచ్చారు. ఇటలీ, అమెరికా తరహాలో వైరస్ విజృంభిస్తే ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించడం చాలా కష్టమవుతుందని ఆయన చెప్పారు. ప్రపంచం తీవ్రమాంద్యంలో ఉన్నదని అన్నారు. వచ్చే ఏడాది కోలుకుంటుందని ఆశించవచ్చని, అయితే అది మహమ్మారి పునరావృతం కాకపోవడంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఎప్పుడూ ఇబ్బందులు మొదట విదేశీమారకం విషయంలోనే వెల్లడి అవుతాయని, ఈసారి పరిస్థితి రిజర్వ్ బ్యాంక్ నుంచి లభించిన కొద్దిమోస్తరు మద్దతుతో కొంత స్థిరంగానే ఉందని రఘురామరాజన్ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో విధానపరమైన విభేదాల కారణంగా ఆయన 2016లో రాజీనామా చేశారు.